4, ఆగస్టు 2011, గురువారం

అనువాద కవితా సంకలనం 'ఫార్మ్లాండ్ ఫ్రాగ్రన్స్' ఆవిష్కరణ విశేషేశాలు

నా అనువాద కవితా సంకలనం 'ఫార్మ్లాండ్ ఫ్రాగ్రన్స్' ఆవిష్కరణ 31 .7 . 2011 న హైదరాబాద్ లోని సిటి సెంట్రల్ లైబ్రరి లో జరిగింది .పి.జయలక్ష్మి తెలుగు నుంచి ఆంగ్లం లోకి అనువదించారు .వసంత కన్నబీరన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు .నమస్తే తెలంగాణా సంపాదకులు అల్లం నారాయణ అధ్యక్షత వహించారు.తెలుగు విశ్వ విద్యాలయం మాజీ ఉప కులపతి ప్రో ,యన్.గోపి , ఆంధ్రజ్యోతి సంపాదకులు కే .శ్రీనివాస్ .సీఫెల్ విద్యాలయం ప్రో .లక్ష్మి హరిబండి,తెలంగాణా రచయితల వేదిక అధ్యక్షులు జూకంటి జగన్నాధం ,  పి.జయలక్ష్మిలు పాల్గొన్నారు .సమావేశములో అనువాదకులు ,తెలంగాణా వాదులు ,జర్నలిస్ట్లు లు ,పలువురు సాహిత్య ప్రముఖులు హాజరయ్యారు.ఈ సభను కరీంనగర్ "సాహితీ సోపతి "నిర్వహించింది .

30, జూన్ 2011, గురువారం

ఊరేగింపుల పాదముద్రలు

ఊరూరి దారుల మీద 
ఊరేగింపుల పాదముద్రలు 

వాడ వాడల అరుగుల మీద 
వేదన ఆవేదనల ఆలాపనలు 

నాలుగు బాటలు కలసిన పానాదులన్ని  
బతుకు బతుకమ్మల ఆటపాటలు

రోడ్డు బస్టాండు మూలమలుపులన్ని  
వండి వార్చిన సహపంక్తి  బోజన విస్తళ్ళు 

చెట్టూ ఆర్చి స్థంబం ఎక్కడి జెండాల్లోనైన
గుండె మ్యాపుల రెప రెపలు 

సంటి పిల్లల నుంచి 
రాలి పోయే పండు ముసలి పండ్లదాక 
మాటా ఒక్కటే ముచ్చటా ఒక్కటే 
జైకొట్టే జెండా వొక్కటే 

గాలి నేలా చెట్టు చేమా గుట్టా పిట్టా 
అస్తిత్వ ఆకాంక్షలు నినాదాలై నినదిస్తున్నై 

27, జూన్ 2011, సోమవారం

దుక్కి నిండా దుక్కం

సల సల మసిలే కన్నీళ్ళ కోనేరును 
వాదన చేసి వాదంగా నిలిపినవు.

కమ్ముకున్న కమ్మ కుట్రల రట్టు చేయగా
వేదన వదలను సిద్ధాంతం గ మలిచినవ్

పడుసు తనం నుంచి నిన్న మొన్నటిదాకా
మిడతల వలసలను కండ్లరజుసి 

పుట్టిన పీడన రడ  పుండ్లకు మల్లం రాస్తివి 
వేల వేల  ఉపన్యాసాలు వ్యాసాలు పుస్తకాలు 
ఎన్ని చేస్తివి , ఎంత తిరిగితివి , ఎంత రాస్తివి 

జయశంకర్ సార్
 తెలంగాణ మొగులు మీద సింగిడి పుసినవ్  
నీ మరణం దుక్కి నిండా దుక్క పాతం......................

27, డిసెంబర్ 2010, సోమవారం

poem of Annavaram Devender గుట్ట ... పచ్చ నోట్ల కట్ట

గుట్ట

 

             పచ్చ నోట్ల కట్ట

సుట్టూ పదూర్ల పెట్టు
కండ్ల సలువ ఆ గుట్ట
అరొక్క జీవరాసులు కలె తిరిగే మైదానం
రేగుపరికి బల్సుకు తునికి
పండ్లెన్ని తిన్నా దంగని తీపి
సొరికెలు దోనెలు సొరంగాలు
బండ మీద నిలబడ్డ మహాబండ
నీళ్ల తావుల కాడ గోదల కాళ్ల ముద్రలు
ఎక్కంగ దిగంగ బాటొంటి కన్పించే గురుతులు
కల్మశం కలవని గుండం నీళ్లు
ఏండ్లకేండ్లు ఆవిరి కాని సెలయేర్లు

సుట్టూ పదూర్ల పెట్టు
అందరికీ కండ్ల సొగసు ఆ కనికట్టు

గుట్టంటే- మద్ది పాలకొడిశె ఏప జిలుగు జిట్రేగు
మర్రి మోత్కుల్లు మొలిసి పెరిగిన రాళ్లవనం
గుట్ట ఒక పెద్ద పురా జాడ
గుట్ట సజీవ సౌందర్యవనం
గుట్ట పుట్టుక వెయ్యిల గుట్టల ఏండ్లు
సకల ప్రాణుల పసందైన లోకం
గుట్ట నిండా గుబురుగా పెరిగిన
ముండ్ల చెట్లు పండ్ల చెట్లు మందు చెట్లు
మొగులు నిండా తిరిగే
పూరేల్లు గొర్రెంకలు కొంగలు బుర్కపిట్టలు
గుట్టానందం ఎక్కినోల్లకే తెలుస్తది
ఎక్కినకొద్దీ మొగులును ముద్దిచ్చుకున్నట్టు
కిందికి చూస్తే
చింతాకంత మడికట్లు వరిపొలాలు
అగ్గిపెట్టెల ఇండ్లు దారంపోసల దారులు
నువ్వు గింజలై నడుస్తున్న ఆవుల మందలు

దీన్ని నిగురాన్‌గ చూస్తే
మంచి సుతారి మజుబూత్‌గ కట్టినట్లే అన్పిస్తది
గుట్ట మీది వాన నీళ్లు
సుట్టూ కాలువలు కాలువలుగ పారి
చెర్లు కుంటల దూప తీర్చే ధారలు
గుట్ట సుట్టువార మైలు దూరం దాకా
పొలాలన్నీ జాలు నీళ్ల కాలువలు
బాయిలు బందాలన్నీ కొప్పురం కొప్పురం

పక్కపొన్న గుట్టుంటే
ఊరందరికీ గుట్టంత గుండె ధైర్యం

తాతల కాలం నుంచీ గంభీరంగున్న గుట్టతల్లి
ఇయ్యాల గజగజ వణుకతంది
గుట్ట పచ్చ నోట్ల కట్టైంది
వానికి గుట్ట నిండా పైసలే కన్పిస్తున్నాయి
గుట్ట తల్లిని కైమకైమ కంకర చేస్తున్రు
మెరిసే గ్రైనేట్ రాళ్ల గుట్టలన్నీ
సముద్రం ఆవలి దేశాలకు అమ్ముతున్రు
బొమ్మల గుట్టమీది జినవల్లభుని కందపద్యం
పదకొండు వందల ఏండ్ల శాసన చరిత్ర
కన్నడ ఆదికవి పంపని కాలపు శిల్పం
ఆనాడు గుట్టలే కావ్యాల కాన్వాసులు
అన్ని గుట్టలనూ గులాబ్‌జామూన్‌లా తింటండ్రు
కురిక్యాల పోరండ్ల ఒడ్యారం అన్నారం
నందగిరికోట్ల నేర్జాపురం నెమల్లగుట్ట
అన్నిటినీ దోస వక్కలోలె కోస్తండ్రు

సకల జీవరాసులకు పెట్టనికోట- గుట్ట
అది ఎచ్చ పచ్చని నీడ పర్యావరణ జాడ

- అన్నవరం దేవేందర్
94407 63479
(కరీంనగర్ జిల్లాలో 560 గుట్టలను గ్రైనేట్ క్వారీలకు అనుమతిచ్చిండ్రని తెలిసి..)
published in Andhrajyothi daily vivida page 27/12/2010

21, డిసెంబర్ 2010, మంగళవారం

ముస్లిం బహుజన తెలంగాణా పండుగ




పీరీల పండుగ ముస్లిం బహుజన తెలంగాణా పల్లె సంస్కృతికి అద్దం వంటిది . అస్సోయ్ దూల ఆట ఎగురుకుంట ఆ మంటల ఆలవా సుట్టు తిరుగుతంటే మస్తు సంబురం .నేను మా తమ్ముడు శ్రీనివాస్ తో కలిసి  ఈ పండుక్కు కొండాపూర్, పోతారం ల పాల్గొన్నం .చాలా రోజుల తరువాత పీరీల పండుగల పాల్గొన్నం .అక్కడ మదార్ సాబ్ .లస్మయ్య ,గడ్డం వెంకటరాజం పాడిన ఆశన్న ఉషన్నపాటలు బహు పసందుగా పాడిన్డ్రు.పాత పాటలే కాదు కొత్తగా తెలంగాణా కోరికను కలుపుకుంట కై కట్టిండ్రు. ఈ పండుగ లో ముస్లిం దూదేకుల ,కాష తురుక ఇతర చేతి వృతుల వ్యవసాయ   కులాల స్త్రీ పురుషులు అంతా పాల్గొన్నారు. కొండాపూర్ వూల్లె మస్తు జరిగింది. దీన్ని డాక్యుమెంటరి తీద్దామని అంత రికార్డ్ చేసినం..