27, డిసెంబర్ 2010, సోమవారం

poem of Annavaram Devender గుట్ట ... పచ్చ నోట్ల కట్ట

గుట్ట

 

             పచ్చ నోట్ల కట్ట

సుట్టూ పదూర్ల పెట్టు
కండ్ల సలువ ఆ గుట్ట
అరొక్క జీవరాసులు కలె తిరిగే మైదానం
రేగుపరికి బల్సుకు తునికి
పండ్లెన్ని తిన్నా దంగని తీపి
సొరికెలు దోనెలు సొరంగాలు
బండ మీద నిలబడ్డ మహాబండ
నీళ్ల తావుల కాడ గోదల కాళ్ల ముద్రలు
ఎక్కంగ దిగంగ బాటొంటి కన్పించే గురుతులు
కల్మశం కలవని గుండం నీళ్లు
ఏండ్లకేండ్లు ఆవిరి కాని సెలయేర్లు

సుట్టూ పదూర్ల పెట్టు
అందరికీ కండ్ల సొగసు ఆ కనికట్టు

గుట్టంటే- మద్ది పాలకొడిశె ఏప జిలుగు జిట్రేగు
మర్రి మోత్కుల్లు మొలిసి పెరిగిన రాళ్లవనం
గుట్ట ఒక పెద్ద పురా జాడ
గుట్ట సజీవ సౌందర్యవనం
గుట్ట పుట్టుక వెయ్యిల గుట్టల ఏండ్లు
సకల ప్రాణుల పసందైన లోకం
గుట్ట నిండా గుబురుగా పెరిగిన
ముండ్ల చెట్లు పండ్ల చెట్లు మందు చెట్లు
మొగులు నిండా తిరిగే
పూరేల్లు గొర్రెంకలు కొంగలు బుర్కపిట్టలు
గుట్టానందం ఎక్కినోల్లకే తెలుస్తది
ఎక్కినకొద్దీ మొగులును ముద్దిచ్చుకున్నట్టు
కిందికి చూస్తే
చింతాకంత మడికట్లు వరిపొలాలు
అగ్గిపెట్టెల ఇండ్లు దారంపోసల దారులు
నువ్వు గింజలై నడుస్తున్న ఆవుల మందలు

దీన్ని నిగురాన్‌గ చూస్తే
మంచి సుతారి మజుబూత్‌గ కట్టినట్లే అన్పిస్తది
గుట్ట మీది వాన నీళ్లు
సుట్టూ కాలువలు కాలువలుగ పారి
చెర్లు కుంటల దూప తీర్చే ధారలు
గుట్ట సుట్టువార మైలు దూరం దాకా
పొలాలన్నీ జాలు నీళ్ల కాలువలు
బాయిలు బందాలన్నీ కొప్పురం కొప్పురం

పక్కపొన్న గుట్టుంటే
ఊరందరికీ గుట్టంత గుండె ధైర్యం

తాతల కాలం నుంచీ గంభీరంగున్న గుట్టతల్లి
ఇయ్యాల గజగజ వణుకతంది
గుట్ట పచ్చ నోట్ల కట్టైంది
వానికి గుట్ట నిండా పైసలే కన్పిస్తున్నాయి
గుట్ట తల్లిని కైమకైమ కంకర చేస్తున్రు
మెరిసే గ్రైనేట్ రాళ్ల గుట్టలన్నీ
సముద్రం ఆవలి దేశాలకు అమ్ముతున్రు
బొమ్మల గుట్టమీది జినవల్లభుని కందపద్యం
పదకొండు వందల ఏండ్ల శాసన చరిత్ర
కన్నడ ఆదికవి పంపని కాలపు శిల్పం
ఆనాడు గుట్టలే కావ్యాల కాన్వాసులు
అన్ని గుట్టలనూ గులాబ్‌జామూన్‌లా తింటండ్రు
కురిక్యాల పోరండ్ల ఒడ్యారం అన్నారం
నందగిరికోట్ల నేర్జాపురం నెమల్లగుట్ట
అన్నిటినీ దోస వక్కలోలె కోస్తండ్రు

సకల జీవరాసులకు పెట్టనికోట- గుట్ట
అది ఎచ్చ పచ్చని నీడ పర్యావరణ జాడ

- అన్నవరం దేవేందర్
94407 63479
(కరీంనగర్ జిల్లాలో 560 గుట్టలను గ్రైనేట్ క్వారీలకు అనుమతిచ్చిండ్రని తెలిసి..)
published in Andhrajyothi daily vivida page 27/12/2010

3 కామెంట్‌లు:

  1. నగరాలలో నాలుగు మెతుకుల కోసం మనం చేసే నిత్య పోరాటం మధ్యలో మన చుట్టూ జరిగే దౌర్జన్యాలను పట్టించుకోనంతగా మనం బండబారి పోయా మన్నమాట నిజం. కానీ అందరూ ఒకేలా వుండరు కదా! ముఖ్యంగా కవి అన్నవరం దేవేందర్ లాగానయినా కొంత మంది అక్షర శిల్పులు అన్యాయాలను ఎలుగెత్తి చాటే వాళ్లు మన చుట్టూ ఉంటుంటారు.

    తెలుగు భాష పురా వైభవానికి తిరుగులేని సాక్ష్యమయిన జినవల్లభుని కంద పద్యం , కొన్ని వందల ఏళ్ల క్రిందటి శాసనాలను, కన్నడ ఆదికవి పంపని కాలం నాటి శిల్ప చాతుర్యాన్ని తన కడుపులో పెట్టుకుని ఇంతకాలం చల్లంగా కాచిన బొమ్మల గుట్ట వట్టి గ్రానైట్ రాళ్ల గుట్ట కాదు… ఒక సజీవ సహజ సుందర రాతి వనం. గుప్పెడు పచ్చ నోట్ల కోసం గుట్టుగా ఆ గుట్ట గుండెలలో డైనమోట్లు పేల్చటం ఒక ఘోరం మయితే …చెట్టునీ, పుట్టనీ, రాయినీ, రాప్పనీ, పురుగునీ, పుట్రనీ..ఆరొక్క జీవరాసులూ కలే తిరిగే ఆ మైదానాన్ని ..తాతల కాలం నుంచీ గుంభనగా వున్న గుట్ట తల్లిని చెరబడుతుంటే చప్పుడయినా చేయలేని నిస్సహాయత ఒక శాపం . చేయాలని లేని మన చేతకానితనం అంతకు మించిన పాపం, నేరం.

    ఆ ఆవేదనతో నిండిన అన్నవరం దేవేందర్ గొంతుకే బొమ్మలగుట్ట గుండె అలజడి.

    కనీసం దీన్నయినా విని మన పరిసరాలకు జరిగే అన్యాయాలను ఖండిద్దమా! పర్యావరణం మీద జరుగుతున్న అత్యాచారాలకు స్పందిద్దా మా!

    రిప్లయితొలగించండి
  2. అన్నవరం గారు మీ కవిత
    నా మనసులో బాధ ఒక్కటే

    అంత అందమైన గుట్టలన్నీ
    మాయమైతే ముందుతరాలకు
    వాటి గురించి ఎలా చెప్పాలి
    మీ కవిత కూడా అప్పుడు అర్థం కాదేమో
    జురాస్సిక్ పార్క్ సినిమాలో డైనోసర్ లను
    చూపినట్టు చూపాలేమో

    తాత ముత్తాతల నుంచి ఉంటున్న
    ఆస్తుల్ని మనం పోగొట్టుకుంటామా
    అందల గుట్టల్ని ఈరొజు పొగొట్టు కుంటే
    మన చెతకానితనం కాదా
    మన పిల్లలకు ముందుతరాలకు అందించని
    నల్ల మొకపుతనం కాదా

    దేవుడి సృష్టి అయిన కొండల్ని
    మనం మల్లీ కావాలంటే
    కట్టగలమా

    మా పక్కనున్న మల్లెగుట్టను
    మట్టికోసం తవ్వితేనే
    మనసుకు గాయమైంది
    మా మ్యాడంపల్లి గుట్టను
    ఇప్పుడు చెక్కలు చెస్తున్నరు
    నా గుండెను ముక్కలు చేస్తున్నరు

    ఊరు ఊరంతా ఏకమై
    మా గుట్టను కొట్టద్దని
    అడ్డుపడితే కేసులు పెడుతున్నరు

    ఎవడో అధికారి మా గుట్టను
    వాడికి రాసిచ్చాడట
    ఎవడో నాయకుడు అనుమతి ఇచ్చాడట
    గుట్టపై వాళ్ళకి ఉన్న అధికారమేంది?
    గుట్ట ఎంత పెద్దది
    ఎంత గొప్పది
    దానినే అమ్మేటంత దమ్మా

    చూసుకుంట కుర్చుంటే
    మనం మనుషులమే కాదు
    మన ముందు తరం క్షమించదు

    మన ఊరి గురుతులను
    మన గొడ్డుగోద ఆధారాలను
    మన పండ్లు ఫలాల తొటను
    మన పొద్దు పొదిచే లోగిళ్ళను
    పొద్దు గూకే సందిళ్ళను
    మన దేవుళ్ళ నెలవులను
    మన పంచ ప్రనలను
    విడదీయలేని బంధాలను
    కాపదుకుందాం
    అందుకు పల్లె పట్నం
    అన్న తేడా మరిచి
    కలిసి కొట్లాడుదాం

    - తిరుపతి పెద్ది
    ఈనాడు ఉపసంపాదకుదు
    80080 18881

    రిప్లయితొలగించండి
  3. అన్నవరం గారు మీ కవిత
    నా మనసులో బాధ ఒక్కటే

    అంత అందమైన గుట్టలన్నీ
    మాయమైతే ముందుతరాలకు
    వాటి గురించి ఎలా చెప్పాలి
    మీ కవిత కూడా అప్పుడు అర్థం కాదేమో
    జురాస్సిక్ పార్క్ సినిమాలో డైనోసర్ లను
    చూపినట్టు చూపాలేమో

    తాత ముత్తాతల నుంచి ఉంటున్న
    ఆస్తుల్ని మనం పోగొట్టుకుంటామా
    అందల గుట్టల్ని ఈరొజు పొగొట్టు కుంటే
    మన చెతకానితనం కాదా
    మన పిల్లలకు ముందుతరాలకు అందించని
    నల్ల మొకపుతనం కాదా

    దేవుడి సృష్టి అయిన కొండల్ని
    మనం మల్లీ కావాలంటే
    కట్టగలమా

    మా పక్కనున్న మల్లెగుట్టను
    మట్టికోసం తవ్వితేనే
    మనసుకు గాయమైంది
    మా మ్యాడంపల్లి గుట్టను
    ఇప్పుడు చెక్కలు చెస్తున్నరు
    నా గుండెను ముక్కలు చేస్తున్నరు

    ఊరు ఊరంతా ఏకమై
    మా గుట్టను కొట్టద్దని
    అడ్డుపడితే కేసులు పెడుతున్నరు

    ఎవడో అధికారి మా గుట్టను
    వాడికి రాసిచ్చాడట
    ఎవడో నాయకుడు అనుమతి ఇచ్చాడట
    గుట్టపై వాళ్ళకి ఉన్న అధికారమేంది?
    గుట్ట ఎంత పెద్దది
    ఎంత గొప్పది
    దానినే అమ్మేటంత దమ్మా

    చూసుకుంట కుర్చుంటే
    మనం మనుషులమే కాదు
    మన ముందు తరం క్షమించదు

    మన ఊరి గురుతులను
    మన గొడ్డుగోద ఆధారాలను
    మన పండ్లు ఫలాల తొటను
    మన పొద్దు పొదిచే లోగిళ్ళను
    పొద్దు గూకే సందిళ్ళను
    మన దేవుళ్ళ నెలవులను
    మన పంచ ప్రనలను
    విడదీయలేని బంధాలను
    కాపదుకుందాం
    అందుకు పల్లె పట్నం
    అన్న తేడా మరిచి
    కలిసి కొట్లాడుదాం

    - తిరుపతి పెద్ది
    ఈనాడు ఉపసంపాదకుదు
    80080 18881

    రిప్లయితొలగించండి